: కేసీఆర్ ప్రభుత్వ తీరు బాగోలేదు!: తమ్మినేని వీరభద్రం
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ తీరుపై సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం చేస్తోన్న భూసేకరణ గందరగోళంగా ఉందని విమర్శించింది. ఈరోజు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ చెప్పే విషయాలు, చేసే పనులు విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంలో 2013 చట్టం లేదా జీవో 123లలో రైతులు ఏది కోరుకుంటే దాని ప్రకారమే ముందుకెళతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని, అయితే వారు చేసిన ప్రకటన ఎందుకు అమలు కావడం లేదని ఆయన ప్రశ్నించారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి గ్రామసభలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించి, వాటికి అనుగుణంగా వ్యవహరించాలని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సర్కారు తీరుకి వ్యతిరేకంగా నిర్వాసితులు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు దిగుతున్నారని ఆయన విమర్శించారు. భూనిర్వాసితులకు మద్దతుగా పాదయాత్రలు చేయాలని తాము నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.