: ప్రియురాలి కోసం దొంగతనాలకు దిగిన యువకుడు.. కార్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడిన వైనం


ప్రేమలో పడ్డాడు. ప్రియురాలికి ఏది కావాలంటే అది కొనివ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఉద్యోగం మాత్రం లేదు. ‘న్యాయంగా సంపాదించి డబ్బు సంపాదిస్తా’ అనే ఆలోచ‌నే రాలేదు. త‌న ప్రియురాలికి కావల‌సింది ఇవ్వాలంటే త‌న ద‌గ్గ‌ర డ‌బ్బు ఉండాల‌నే విష‌యాన్ని మాత్ర‌మే దృష్టిలో ఉంచుకున్నాడు. చివ‌రికి దొంగ‌లా మారి విలువైన వ‌స్తువుల‌ని చోరీ చేసే ప‌నిలో ప‌డ్డాడు. కర్ణాటకలోని దావణగెరెకు చెందిన వీరేష్ అంగడి (27) స్టోరీ ఇది. ఇటీవలే వీరేష్ అక్క‌డి ధార్వాడ్ ప్రాంతానికి వెళ్లాడు. త‌న ప్రియురాలికి అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌డానికి, విలువైన వ‌స్తువులు కొనివ్వ‌డానికి దొంగ‌త‌నాలు చేస్తూ పోలీసుల‌కి ప‌ట్టుబడ్డాడు. పోలీసుల‌కి తాను దొంగ‌త‌నాలు ఎలా చేయాలో ఎక్క‌డ నేర్చుకున్నాడో చెబుతూ.. యూ ట్యూబ్లో దొంగ‌త‌నాల‌కు సంబంధించిన‌ వీడియోలు చూసి నేర్చుకున్నాన‌ని తెలిపాడు. ఆస్పత్రులు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్ సహా పలు చోట్ల పార్కింగ్ చేసిన కార్లలోంచి వీరేష్‌ విలువైన వ‌స్తువుల‌ను చోరీ చేసేవాడు. కార్ల‌ అద్దాలను పగలగొట్టి వాటిలో ఉన్న వ‌స్తువుల కోసం వెతికేవాడు. కార్ల‌లో బంగారం, డబ్బు దొరుకుతుందని భావించాడ‌ట‌. అయితే వాటిలో ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు ఎక్కువ‌గా దొరికాయి. డెబిట్ కార్డుల‌ను కూడా దొంగిలించాడు. చివ‌రికి తాను దొంగిలించిన డెబిట్ కార్డుతో హుబ్బలిలో మద్యం కొనుగోలు చేస్తోన్న వీరేష్‌ని పోలీసులు ప‌ట్టుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో వీరేష్‌పై నిఘా పెట్టిన పోలీసులు అత‌డిని సీసీటీవీ ఫుటేజీ సాయంతో ప‌ట్టుకున్నారు. వీరేష్‌ను అదుపులోకి తీసుకొని అత‌డి ద‌గ్గ‌ర నుంచి 12 లాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, డెబిట్ కార్డులు, ఓ హార్డ్ డిస్క్ తో పాటు ప‌లు విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ‌స్తువుల విలువ‌ 4.76 లక్షల రూపాయలు ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు. 15 చోరీల కేసులలో వీరేష్ నిందితుడిగా ఉన్నాడ‌ని పోలీసులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News