: యూరప్ మార్కెట్ ప్రభావంతో పెరిగిన సెంటిమెంట్, స్వల్ప లాభాల్లో మార్కెట్


సెషన్ ప్రారంభం నుంచి ఒడిదుడుకుల మధ్య సాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ సూచికలు, యూరప్ మార్కెట్ల సరళితో కాస్తంత పుంజుకున్నాయి. ఒకదశలో క్రితం ముగింపుతో పోలిస్తే, 100 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్ సూచి, మధ్యాహ్నం తరువాత కొనుగోళ్లు కనిపించడంతో లాభాల దిశగా సాగింది. స్మాల్ క్యాప్ సూచిక మాత్రం ఒత్తిడిలోనే ఉండిపోయింది. మంగళవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 40.96 పాయింట్లు పెరిగి 0.15 శాతం లాభంతో 27,787.62 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 19.85 పాయింట్లు పడిపోయి 0.23 శాతం నష్టంతో 8,528.55 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.18 శాతం పెరుగగా, స్మాల్ కాప్ 0.11 శాతం నష్టపోయింది. ఇక ఎన్ఎస్ఈ-50లో 33 కంపెనీలు లాభపడ్డాయి. బీపీసీఎల్, ఐడియా, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, లుపిన్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, హిందుస్థాన్ యూనీలివర్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఐచర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,836 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,216 కంపెనీలు లాభాలను, 1,454 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,05,65,565 కోట్లుగా నమోదైంది.

  • Loading...

More Telugu News