: కాళహస్తి దేవాలయంలో రికార్డుల్లో లేని బంగారం... నేడు వెలుగులోకి వచ్చిన కవచం, ఆభరణాలు!
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దేవాలయంలో దశాబ్దాలుగా ఎవరికీ తెలియని, రికార్డుల్లో లేని బంగారు ఆభరణాలు వెలుగుచూశాయి. ఆలయ తనిఖీల్లో భాగంగా ఈఓ భ్రమరాంబ, పాలక మండలి చైర్మన్ గురవయ్య నాయుడు తదితరులు ఖజానాను పరిశీలిస్తుండగా, 475 గ్రాముల స్వామివారి బంగారు కవచంతో పాటు ఒకటిన్నర కేజీల బరువున్న ఇతర ఆభరణాలు స్ట్రాంగ్ రూములో బయటపడ్డాయి. వీటి గురించిన వివరాలు రికార్డుల్లో లేవు. దీంతో ఇవి ఎక్కడివన్న విచారణ జరిపిన అధికారులు, ఇవి 1954లో మైసూర్ మహారాజావారు ఇచ్చినవని గుర్తించారు. వెంటనే వాటి వివరాలు నమోదు చేశామని, గత పాలకుల నిర్లక్ష్యంగానే ఇవి మరుగున పడ్డాయని గురవయ్య ఆరోపించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఈ ఆభరణాలను, కవచాన్ని స్వామివారికి అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. వీటన్నింటినీ జాగ్రత్త చేసి భవిష్యత్ తరాలకు అందిస్తామని వివరించారు.