: కుమార్తెను చూడనివ్వని భర్తకు 5 లక్షల జరిమానా, జైలు శిక్ష


భార్యాభర్తల మధ్య విభేదాలు పొడసూపితే కక్షసాధింపులకు ప్రధాన సాధనాలుగా పిల్లలు మారుతారు. వారి మధ్యనున్న వ్యక్తిగత విభేదాల తీవ్రతను బట్టి పిల్లలపై ఆ సాధింపులు ఉంటాయి. ఇలాంటి విభేదాల వల్ల తల్లికి బిడ్డను దూరం చేసిన ఓ తండ్రికి బాంబే హైకోర్టు ఝలక్కిచ్చింది. తల్లి నుంచి బిడ్డను దూరం చేయడం నేరమని చెప్పిన బాంబే హైకోర్టు నిందితుడికి శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే... ముంబైలోని బాంద్రాకు చెందిన షాహిద్ పలావ్కర్ (42), సమీరా (31) భార్యాభర్తలు. విభేదాలు పొడసూపడంతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. వీరి కుమార్తె ఆలనాపాలన షాహిద్ చూస్తున్నాడు. ఆమె బాగోగులు చూస్తున్నానన్న నెపంతో కుమార్తెను సమీరాకి చూపించడం లేదు. దీంతో ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం, బాలిక కస్టడీ గురించి కుటుంబ న్యాయస్థానం తీర్పు వెలువడే వరకు బాలికను తల్లికే అప్పగించాలని ఆదేశించింది. కుమార్తెను కస్టడీలో ఉంచుకోవడానికి తండ్రికి అర్హత లేదని స్పష్టం చేసింది. ఇది బాలిక సంక్షేమానికి మంచిది కాదని, ఆమెకు నష్టం కలిగిస్తుందని అభిప్రాయపడింది. కుమార్తెను కస్టడీలో ఉంచుకునేందుకు తనకు అర్హత లేదని షాహిద్ నిరూపించుకున్నాడని తెలిపింది. షాహిద్ ను దోషిగా నిర్దారించిన న్యాయస్థానం, అతనికి మూడు నెలల జైలు శిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

  • Loading...

More Telugu News