: వడ్డీ వ్యాపారుల వల్ల అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారు: గవర్నర్
వడ్డీ వ్యాపారుల ఆగడాలపై గవర్నర్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో అసోచామ్ ఆధ్వర్యంలో మైక్రోఫైనాన్స్‌పై నిర్వహించిన సదస్సుకు ఆయన హాజరై ప్రసంగించారు. గ్రామీణ ప్రజలపై వడ్డీ వ్యాపారుల వేధింపులు భావ్యం కాదని ఆయన అన్నారు. మైక్రో ఫైనాన్స్ వ్యాపారులు చేస్తున్న వ్యాపారం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. నైతిక విలువలు పాటించకుండా వారు వ్యాపారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అవిభాజ్య రాష్ట్రంలో వారి వల్లే అనేక మంది బలవన్మరణాలు చేసుకున్నారని నరసింహన్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల నైపుణ్యాలను గమనించి వారికి రుణాలు ఇవ్వాలని ఆయన సూచించారు. మైక్రో ఫైనాన్షియర్లు దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యేందుకు బాధ్యతగా మెలగాలని ఆయన పేర్కొన్నారు.