: టీమిండియాను సర్ప్రైజ్ చేసిన విండీస్ క్రికెట్ దిగ్గజం రిచర్డ్స్!
భారత క్రికెటర్లకు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ ఆశ్చర్యాన్ని కలిగించారు. భారత క్రికెటర్లు ప్రాక్టీసు చేస్తున్న వేళ, చెప్పాపెట్టకుండా స్వయంగా అక్కడికి వచ్చారు. వారితో మాట్లాడి నూతనోత్సాహాన్ని నింపారు. రిచర్డ్స్ ను చూసిన క్రికెటర్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విండీస్ తో నాలుగు టెస్టు మ్యాచ్ లు జరగనున్న వేళ, రిచర్డ్స్ వచ్చి తన విలువైన సమయాన్ని కేటాయించడం పట్ల కోహ్లీ, రహానేలు కృతజ్ఞతలు తెలిపారు. టెస్టు జట్టు కెప్టెన్ కోహ్లీ, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో సెంచరీలు కొట్టడాన్ని ఈ సందర్భంగా రిచర్డ్స్ అభినందించారు. కోహ్లీ నిదానంగా ఉంటూనే ఆట గతిని మార్చి వేయగల సత్తా ఉన్న వ్యక్తని పొగడ్తలతో ముంచెత్తారు. స్టువర్ట్ బిన్నీ తండ్రి రోజర్ బిన్నీ భారత క్రికెట్ జట్టులో ఉన్న సమయంలో 1983 వరల్డ్ కప్ జరిగిందని, అందులో తానూ పాల్గొన్నానని పాత రోజులను తనయుడు స్టువర్ట్ బిన్నీకి రిచర్డ్స్ గుర్తు చేశారు.