: వరంగల్ లో విచిత్రం... టీవీ రిమోట్ తో ఆగుతున్న కరెంట్ మీటర్ రీడింగ్.. తలపట్టుకుంటున్న అధికారులు!
టీవీ రిమోట్ ను నొక్కితే, ఆ ఎలక్ట్రానిక్ విద్యుత్ మీటర్లలో రీడింగ్ నిలిచిపోతోంది. ఎలాంటి టీవీ రిమోట్ అయినా ఇదే జరుగుతోంది. టీఎస్ ఎన్సీడీసీఎల్ పరిధిలోని వరంగల్ లో కొత్త మీటర్లు బిగించే దిశగా విజన్ టెక్ తయారు చేసిన నూతన రకం ఎలక్ట్రానిక్ మీటర్లను భారీ ఎత్తున ఆర్డర్ ఇచ్చి తీసుకురాగా, అవన్నీ టీవీ రిమోట్ కు స్పందిస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు మీటర్లు మార్చే అవకాశం లేదని తేల్చి చెబుతున్న అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వాస్తవానికి ఈ మీటర్లు ఒక్కోటి రూ. 747 చొప్పున దాదాపు 1.40 లక్షలను ఉత్తర తెలంగాణ జిల్లాల కోసం తీసుకువచ్చారు. మరో 1.50 లక్షల మీటర్లు డెలివరీ కావాల్సి వున్నాయి. కొత్త ఇళ్లకు, నూతన కనెక్షన్లకు, మీటర్లు కాలిపోయినప్పుడు వీటిని అందిస్తున్నారు. ఈ మీటర్ల తయారీ పూర్తయిన తరువాత రిమోట్ తో టెస్టింగ్ చేయకపోవడమే సమస్యకు కారణమని తెలుస్తోంది. వినియోగదారులకు వీటిని అందించడం ఆపేశామని, ప్రస్తుతం అమర్చిన మీటర్ల పరిస్థితిపై అధికారులతో చర్చిస్తున్నామని తెలంగాణ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ నర్సింగ్ రావు చెబుతున్నారు. కొత్త మీటర్లను టీవీ రిమోట్ తో ఆపివేయవచ్చని కొంతమందికే తెలుసునని, ఈ విషయం అందరికీ తెలిస్తే, విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.