: కశ్మీర్ లోయలో 12వ రోజూ కొనసాగుతున్న కర్ఫ్యూ.. బంద్ పాటిస్తున్న వేర్పాటు వాదులు
కశ్మీర్ లోయలో వరుసగా 12వ రోజు కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. మరోవైపు వేర్పాటు వాదులు బంద్ పాటిస్తున్నారు. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత కశ్మీర్ వ్యాప్తంగా ఘర్షణలు చెలరేగిన విషయం విదితమే. తాజాగా సోమవారం అనంత్‌నాగ్‌లోని ఖజిగండ్‌లో ఆందోళనకారులు ఆర్మీపెట్రోల్‌పై దాడి చేశారు. భద్రతాధికారుల కాల్పుల్లో ఇద్దరు మృతిచెందారు. అల్లర్ల కారణంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 45కు చేరుకుంది. వీరిలో 43 మంది పౌరులు కాగా ఇద్దరు పోలీసులు ఉన్నారు. పోలీసులు ముందస్తు చర్యగా మొబైల్ ఇంటర్నెట్, కాలింగ్ సేవలను నిలిపివేశారు. బీఎస్‌ఎన్ మాత్రం పోస్టు పెయిడ్ వినియోగదారులకు పరిమిత సేవలు అందిస్తోంది. గత మూడు రోజులుగా లోయలో న్యూస్ పేపర్లు పబ్లిష్ కావడం లేదు. వ్యాలీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈనెల 25 వరకు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఉగ్రవాది బుర్హాన్ వనీకి నివాళిగా మంగళవారాన్ని ‘బ్లాక్ డే’గా పరిగణించనున్నట్టు పాక్ పేర్కొన్న నేపథ్యంలో కశ్మీర్ వ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.