: ఎంపీ పదవి గుదిబండగా మారింది... అందుకే రాజీనామా చేశాను: నవజ్యోత్ సింగ్ సిద్ధూ


ఎంపీ పదవి తనకు భారంగా మారిందని, అందుకే ఆ పదవికి రాజీనామా చేశానని బీజేపీ నేత, క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వ్యాఖ్యానించారు. తన పదవికి రాజీనామా చేయడానికి ముందు ఒక ఇంగ్లీష్ వార్తా ఛానెల్ తో సిద్ధూ మాట్లాడుతూ, పంజాబ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. 'పంజాబ్ కు దారులన్నీ మూసుకుపోయినప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు, ఈ ఎంపీ పదవి అన్నది గుదిబండగా మారింది. అందుకే ఆ పదవిలో కొనసాగాలనుకోవడం లేదు' అని స్పష్టం చేశారు. తప్పో, ఒప్పో అనే పోరాటంలో, తటస్థంగా ఉండటం చాలా కష్టమని, పంజాబ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే తనకు ముఖ్యమని యాభై రెండేళ్ల సిద్ధూ పేర్కొన్నారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో ఆయన చేరనున్నారంటూ వస్తున్న ఆరోపణలకు ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి. తన ఎంపీ పదవిని ‘భారం’ అనే పదంతో పోల్చి చెప్పడంతో పార్టీపై ఆయన ఎంత అసంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని ఆయన రాసిన రాజీనామా లేఖ స్పష్టం చేస్తోంది. ఇదిలా ఉండగా, ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ ను సిద్ధూ వచ్చే రెండు రోజుల్లో కలవనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ లో ఆప్ సీఎం అభ్యర్థిగా సిద్ధూను ఎంపిక చేస్తారనే వార్తలు హల్ చల్ చేస్తుండటం, సిద్ధూ బీజేపీకి గుడ్ బై చెప్పడం, ఆయన రాజీనామా చేయడాన్ని ఆప్ స్వాగతించడం వంటి వార్తలు సిద్ధూ ఆప్ లోకి వెళతారనే ఊహాగానాలకు మరింత ఊతాన్నిస్తున్నాయి.

  • Loading...

More Telugu News