: చంద్రబాబు చెప్పిన అబద్ధాలను ప్రజలందరికీ తెలియజేయడానికే 'గడప గడపకు వైఎస్సార్': జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. విశాఖపట్నం జిల్లా మునగపాకలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్ మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఎన్నో హామీలిచ్చారని, ఇప్పుడు ఆయన తీరు ఎలా ఉందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన అబద్ధాలను ప్రజలందరికీ తెలియజేస్తామని, అందుకే తాము 'గడప గడపకు వైఎస్సార్' కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో గుప్పించిన హామీలను అమలు చేసే వరకు తమ ఉద్యమం ఆగదని జగన్ అన్నారు. అధికారంలోకి వచ్చాక ఇక ప్రజలతో అవసరం తీరిపోయిందని చంద్రబాబు అనుకుటున్నారని ఆయన విమర్శించారు. ప్రజల బాగోగులు పట్టించుకోని అటువంటి వ్యక్తి తీరు పట్ల ప్రజలు ప్రశ్నించాలని ఆయన వ్యాఖ్యానించారు. బ్యాంకుల్లో తాకట్టుగా పెట్టిన బంగారాన్ని తిరిగి ఇప్పిస్తానని, రైతుల రుణమాఫీని ఏ షరతులూ లేకుండా చేస్తానని చంద్రబాబు చెప్పారని, ఇప్పుడు ఆ హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగాలు, ఇళ్లు, నిరుద్యోగభృతి అంటూ ఎన్నికలప్పుడు చంద్రబాబు ఎన్నో మాటలు చెప్పారని జగన్ విమర్శించారు. చంద్రబాబు పాలనలో జరుగుతున్న మోసాలను నిలదీస్తామని ఆయన చెప్పారు.