: బార్లపై నియంత్రణ లేనేలేదు.. తాగిన వారిని శిక్షించడమేంటీ?: వీహెచ్ విమర్శలు
చిన్నారి రమ్య మృతితో బార్లలో మందు తాగుతూ కనిపిస్తోన్న మైనర్లపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంపై తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు స్పందించారు. తెలంగాణలో మద్యం దుకాణాలు, బార్లపై చర్యలు తీసుకోని ప్రభుత్వం తాగిన వారిపై ఎందుకు మండిపడుతోందని ఆయన ప్రశ్నించారు. బార్లు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వాటిని నియంత్రిస్తేనే నేరాలను అరికట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో చేపట్టిన హరితహారం పనులపై వీహెచ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంపై తెలంగాణ ప్రభుత్వ తీరు బాగోలేదని ఆయన పేర్కొన్నారు. మొక్కలు నాటడంతోనే పని అయిపోలేదని, వాటిని సంరక్షించేవారే కనపడడం లేదని ఆయన అన్నారు. మొక్కల సంరక్షణకు కనీసం ట్రీగార్డ్సు కూడా ఏర్పాటు చేయలేదని ఆయన విమర్శించారు.