: దేశంలో జరుగుతోన్న రైతుల ఆత్మహత్యలు బాధాకరం: రఘురాం రాజన్
చైనాలో ఇటీవల తగ్గించిన రీతిలో, మనదేశంలో రూపాయి విలువను తగ్గించడం కుదరదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ రఘురాం రాజన్ పేర్కొన్నారు. ఎన్‌ఐఆర్‌డీ, క్రక్స్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ)లో జరుగుతోన్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా శిక్షణ శిబిరంలో రఘురాం రాజన్ బ్యాంకర్లకు పలు సూచనలిచ్చి, పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాజన్ మాట్లాడుతూ.. భారత్‌లో జరుగుతున్న రైతుల బలవన్మరణాలు బాధాకరమని అన్నారు. దేశంలో కో-ఆపరేటివ్ బ్యాంకుల పరిస్థితి మెరుగ్గానే ఉందని, అయితే పరిపాలనా వ్యవస్థ మెరుగ్గాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలపై ఇకపై దృష్టిపెట్టాలని తాము అనుకుంటున్నట్లు రఘురాం రాజన్ తెలిపారు. బ్యాంకులో అకౌంటు తెరవడానికి శాశ్వత చిరునామా ఉంటే సరిపోతుందని ఆయన అన్నారు. దేశ ప్రజలు ఆర్ధిక అక్షరాస్యతను సాధించాలని ఆయన పేర్కొన్నారు.