: గోల్డ్ బాండ్లు కొనండి... కానీ తక్కువగానేనంటున్న నిపుణులు!
కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం 'సావరిన్ గోల్డ్ బాండ్' స్కీమును ప్రవేశపెట్టిన తరువాత, నాలుగో విడత పెట్టుబడుల స్వీకరణ నేడు ప్రారంభమైంది. గడచిన మూడు విడతల్లో అనుకున్నంత మేరకు బంగారం పెట్టుబడులు రాకపోగా, ఈ దఫా పలు మార్పులు చేర్పులతో స్కీం ప్రజల ముందుకు వచ్చింది. గ్రాముకు రూ. 3,119 ధరను నిర్ణయించినట్టు కేంద్రం వెల్లడించింది. ఇక ఈ బాండ్లలో పెట్టుబడులు పెట్టడం దీర్ఘకాలంలో మంచిదేనని, అయితే, సేవింగ్స్ మొత్తం గోల్డ్ బాండ్లకు కేటాయించకుండా, వివిధీకరణ మార్గాన్ని అమలు చేస్తేనే మేలు కలుగుతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. కాగా, ఈ దఫా కనీసం 1 గ్రాము బంగారాన్ని కూడా బాండ్ల రూపంలో కొనుగోలు చేసే సదుపాయాన్ని కేంద్రం దగ్గర చేసింది. గతంలో కనీసం 5 గ్రాముల నుంచి పెట్టుబడులు పెట్టే వీలుండగా, మధ్య తరగతి ప్రజలను ఈ స్కీమ్ పెద్దగా ఆకర్షించలేకపోయినట్టు విశ్లేషణలు వచ్చాయి. దీంతో కనీస మొత్తాన్ని గణనీయంగా తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ బాండ్లను బ్యాంకులు, పోస్టాఫీసులతో పాటు ఎన్ఎస్ఈ, బీఎస్ఈల నుంచి కూడా కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది. "బంగారం బాండ్లపై పెట్టే పెట్టుబడులపై 2.75 శాతం వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ వరకూ వేచి చూసేవారిపై మూలధనపు లాభాల పన్ను భారం ఉండక పోవడం ఆకర్షణీయం" అని ప్లాన్ రూపీ వ్యవస్థాపకుడు అమోల్ జోషి వ్యాఖ్యానించారు. కొద్ది మొత్తాల్లో బంగారంపై పెట్టుబడులు పెట్టడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. వాస్తవానికి ఈ సంవత్సరం మిగతా అన్ని పెట్టుబడుల మార్గాలకన్నా బులియన్ మార్కెట్ మంచి రాబడిని ఇచ్చింది. జనవరితో పోలిస్తే బంగారం ధర 23 శాతం పెరిగింది. సంప్రదాయ బ్యాంకు డిపాజిట్లు, స్టాక్ మార్కెట్ల కన్నా ఇది అధికం. దీంతో మలి విడత బాండ్లకు మంచి స్పందన వస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది.