: కేసీఆర్ కు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చివున్నా, వైఎస్ మరణించకున్నా ప్రస్తుత పరిణామాలు వేరేగా ఉండేవి!: జైరాం రమేష్ కీలక వ్యాఖ్య
ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న తరువాత, కేసీఆర్ అడిగినట్టుగా ఆయనకు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చినా, వైఎస్ రాజశేఖరెడ్డి ఘోర ప్రమాదంలో మరణించకపోయినా, ప్రస్తుత పరిణామాలు భిన్నంగా ఉండేవని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు ఘటనల్లో ఏది జరిగినా ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఉండేది కాదని అన్నారు. ఏపీ విభజన వెనుక కులాల కుంపటి కూడా ఉందని ఆసక్తికర వ్యాఖ్యలను తన తాజా పుస్తకం 'గడచిన చరిత్ర - తెరచిన అధ్యాయం' ఆవిష్కరణలో చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 90 మంది వరకూ రెడ్డి వర్గీయులు విజయం సాధిస్తుండేవారని, వైఎస్ మరణం తరువాత జరిగిన పరిణామాలతో ఆ వర్గం తమకు దూరమైందన్న భావనకు కాంగ్రెస్ వచ్చిందన్న అర్థం చ్చేలా ఆయన మాట్లాడారు. ఇతర కులాలను కాంగ్రెస్ ఆకట్టుకోలేక పోయిందని, తమతో ఉన్నవారిని దూరం చేసుకుని ఘోరంగా నష్టపోయిందని తెలిపారు. కులాల కుంపట్ల గురించి ఇంతకన్నా ఎక్కువ వివరాలు చెప్పలేనని అన్నారు.