: 'ఆత్మహత్య చేసుకుంటోంది... ఆపండి' అని చెబితే చావగొట్టి చంపేశారు!
19 సంవత్సరాల యువతి ఆత్మహత్యకు పాల్పడటాన్ని చూసిన ఇద్దరు యువకులు, ఆమెను ఆపేందుకు గట్టిగా కేకలు వేస్తే, అది చూసిన స్థానికులు వారే, ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపిస్తూ దారుణంగా కొట్టగా, ఒకరు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, అడవుల దీవి పంచాయతీ పరిధిలోని మహ్మదీయ పాలెంలో షేక్ జాస్మిన్ (19), తన స్నేహితురాళ్లకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పింది. అదే సమయంలో గ్రామానికి చెందిన వేముల శ్రీసాయి, జొన్నా పవన్ కుమార్ లు అటుగా వచ్చారు. ఆమె ఆత్మహత్యాయత్నం చేయడాన్ని చూసి చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూసేసరికి ఆమె ఉరేసుకుని మరణించింది. దీంతో పట్టలేని ఆగ్రహంతో, వారే ఆమెపై అత్యాచారం చేసి చంపారని ఆరోపిస్తూ, ఎంత చెబుతున్నా వినకుండా బట్టలూడదీసి, చెట్టుకు కట్టి విపరీతంగా కొట్టారు. ఈలోగా జాస్మిన్ స్నేహితులు, పోలీసులు వచ్చి విషయం చెప్పడంతో వారికి క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన శ్రీసాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో తమ బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఆరోపిస్తూ శ్రీసాయి బంధువులు నిరసనలకు దిగడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఆత్మహత్య, ఆపై జరిగిన ఘటనలపై కేసు నమోదు చేశామని, విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. మంచికి పోయిన పాపానికి ఓ ప్రాణం బలికావడం అందరినీ కలచివేస్తోంది. ముందూ వెనుకా చూడకుండా ఏ మాత్రం ఆలోచించకుండా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారులు వ్యాఖ్యానించారు.