: అతివల పని పిల్లల్ని సాకడమే: విద్యార్థులకు నీతి పాఠాలు బోధిస్తున్న రాజస్థాన్ పాఠ్యపుస్తకాలు
అవును.. పిల్లల్ని పెంచడమే మహిళల పని అని.. పురుషులను అనుసరించడమే వారి విధి అని రాజస్థాన్ పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు బోధిస్తున్నాయి. మహిళలను కించపరిచేలా ఉన్న ఈ పాఠ్యపుస్తకాల్లోని పాఠాలపై ఇప్పుడు తీవ్ర దుమారం చెలరేగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మూడో తరగతి హిందీ పాఠ్య పుస్తకంలో ఉన్న ‘గేమ్స్’ అనే చాప్టర్ లో బాలురు గేమ్స్ ఆడుతున్న మూడు బొమ్మలు ఉన్నాయి. క్రీడలు కేవలం బాలురకే పరిమితమని ఈ బొమ్మలు చెబుతున్నాయి. ఎనిమిదో తరగతిలో సింధీ కవి సంత్ కన్వర్ రామ్ పై ఉన్న పాఠంలోనూ మహిళా వివక్షను చూపించారు. ‘‘పురుషులను అనుసరించడమే మహిళల పని’’ అని అందులో పేర్కొన్నారు. ఈ కవికి ఇద్దరు భార్యలు. ఒక్కొక్కరికి ముగ్గురు చొప్పున ఆరుగురు పిల్లలు. మొదటి భార్య చనిపోయాక 46 ఏళ్ల వయసులో రెండో వివాహం చేసుకున్నారు. ఈ మొత్తం చాప్టర్ లో మగవాళ్ల ఆధిపత్యమే కనిపిస్తుంది. ‘‘పిల్లల్ని సాకడమే మహిళల పని’’ అని చాప్టర్ లో పేర్కొన్నారు. దాదాపు అన్ని చాప్టర్లూ ఇలాగే ఉన్నాయి. శౌర్యం, ధైర్యం తదితర వాటిని పురుషులకే ఆపాదించారు. చాలావరకు పాఠాలు మహిళలు గృహాలకే పరిమితం అన్నట్టు పేర్కొన్నాయి. స్త్రీని ఒక శక్తిగా, నాయకురాలిగా, నిర్వాహకురాలిగా, విధాన రూపకర్తగా ఎక్కడా పేర్కొనలేదు. ఆరో తరగతిలో ఉన్న ‘గులాబ్ సింగ్’ అనే పాఠం మహిళా వివక్షకు మరో చక్కని ఉదాహరణ. ఓ నిరసనలో పాల్గొన్న బాలికను జెండా పట్టుకునేందుకు మొదట నిరాకరిస్తారు. ఆ బాధ్యతను ఆమె సోదరుడికి అప్పగిస్తారు. అతడు చనిపోయాక ఆ పనిని బాలికకు అప్పగిస్తారు. అంటే మొదట పురుషులు.. తర్వాతే మహిళలు అన్న అర్థాన్ని ఈ పాఠం బోధిస్తోందని ఈ పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేసిన దేవయాని భరద్వాజ్ పేర్కొన్నారు. పాఠ్యపుస్తకాల్లో మహిళా వివక్షను పెంచేలా పాఠ్యాంశాలు రూపొందించడంపై రాష్ట్రవ్యాప్తంగా మహిళల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. వెంటనే ఆ పాఠాలు తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జైపూర్, ఢిల్లీలోని పలువురు విద్యావేత్తలు కలసి ఈ పుస్తకాలను రూపొందించడం గమనార్హం.