: కర్నూలులో చంద్రబాబు, విశాఖలో జగన్, ఢిల్లీలో కేసీఆర్... నేడు బిజీ బిజీ!


తెలుగు రాష్ట్రాల ముఖ్య నేతలు నేడు బిజీ బిజీగా గడపనున్నారు. కర్నూలు జిల్లా పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు, విశాఖ పర్యటనకు ప్రతిపక్ష నేత జగన్ వెళ్లనుండగా, తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటించనున్నారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12:40కి మోదీతో సమావేశమయ్యే కేసీఆర్, హైకోర్టు విభజన అంశాన్ని ప్రధానంగా చర్చకు తేనున్నట్టు తెలుస్తోంది. విభజన తరువాత నెలకొన్న విభేదాలు, కృష్ణా జలాల పంపిణీ, గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులు తదితరాంశాలు వీరి మధ్య చర్చకు రానున్నాయి. ఎన్డీయేకు అంశాల వారీగా మద్దతు ఇస్తామని, జీఎస్టీ బిల్లుకు అనుకూలంగా ఉంటామని కేసీఆర్ స్పష్టం చేయనున్నట్టు తెలుస్తోంది. ఆపై కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీలను, మధ్యాహ్నం మూడు గంటలకు ఉమాభారతి, ప్రకాశ్ జవదేకర్ లను ఆయన కలవనున్నారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే, కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఆయన పర్యటించనున్నారు. ముందుగా మల్లికార్జున, భ్రమరాంబలను దర్శించుకునే ఆయన, ఆపై పుష్కర ఘాట్ల ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఆపై అధికారులతో సమీక్షించి, వారికి దిశానిర్దేశం చేస్తారు. వైకాపా నేత జగన్ నేడు విశాఖలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పాల్మన్ పేట ఘర్షణల్లో గాయపడ్డ వారిని పరామర్శించే ఆయన, అక్కడే ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

  • Loading...

More Telugu News