: తిరుగుబాటుదారులందరికీ మరణశిక్ష: టర్కీ అధ్యక్షుడు ఎడ్రోగన్
టర్కీలో తిరుగుబాటుకు యత్నించి, ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిన సైన్యంలోని ఓ వర్గానికి చెందిన సభ్యులందరికీ మరణదండనే సరైన శిక్షని, వారికి మరణశిక్షను విధించే ఆలోచనలో ఉన్నామని అధ్యక్షుడు ఎడ్రోగన్ ప్రకటించారు. రాజద్రోహానికి ఇంతకన్నా మించిన శిక్ష ఉండబోదని, ఈ విషయంలో ప్రజల అభిప్రాయాన్ని కూడా అడుగుతామని తెలిపారు. సైనిక తిరుగుబాటు విఫలం కావడానికి ప్రజలే కారణమని, వారే లేకుంటే ఈ పాటికి దేశంలో ప్రజాస్వామ్యం హరించుకుపోయి ఉండేదని అభిప్రాయపడ్డారు. కాగా, టర్కీలో సైనిక తిరుగుబాటు, ప్రజల స్పందన కారణంగా జరిగిన అల్లర్లలో మరణించిన వారి సంఖ్య 290కి చేరింది. న్యాయవ్యవస్థ, సైనిక వ్యవస్థలకు చెందిన ముఖ్యమైన అధికారులు సహా 6 వేల మందిని ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. వీరందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేసిన వారే. వీరికి మరణశిక్ష విధిస్తే, వర్తమాన ప్రపంచంలో ఇంత మందికి మరణదండన విధించిన దేశంగా టర్కీ మిగులుతుంది. ప్రపంచదేశాలు మరణశిక్షలు వద్దని టర్కీని వారించే అవకాశాలు ఉన్నాయి.