: గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయండి: నరేంద్ర మోదీ ముందు నితీశ్ సంచలన డిమాండ్
దేశంలో గవర్నర్ల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొని ప్రసంగించిన ఆయన, ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లో గవర్నర్ వైఖరిని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించిన నేపథ్యాన్ని గుర్తు చేసిన ఆయన, రాజ్ భవన్ లోని వ్యక్తులు కేంద్ర ప్రభుత్వ అడుగులకు మడుగులొత్తుతున్నారని ఆరోపించారు. కేంద్రం ఎలా చెబితే, అలా చేస్తున్నారని, అన్ని రాష్ట్రాల నుంచి గవర్నర్లను తీసివేయాలని అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులకు గవర్నర్లను తొలగించే అధికారాన్ని కట్టబెట్టాలని అన్నారు. ప్రస్తుత గవర్నర్ వ్యవస్థ మారుతున్న కాలానికి అనుగుణంగా మారలేదని, దీనివల్ల ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలకు ఇబ్బందిగా ఉందని ఆయన అన్నారు. గవర్నర్ల తొలగింపుపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 155ను సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నితీశ్ వివరించారు.