: చైనాలో వేధింపుల కేసులో దేశ బహిష్కరణ శిక్షతో తప్పించుకున్న ఇద్దరు భారతీయులు
ఓ యువతిని వేధించిన కేసులో ఇద్దరు భారతీయులకు చైనా దేశబహిష్కరణ శిక్షతో సరిపుచ్చింది. దీంతో వీరు బతుకుజీవుడా అనుకుని స్వదేశం బాట పట్టారు. హర్యానాకు చెందిన వీరు, ఓ హోటల్ లోని లిఫ్టులో తైవాన్ నుంచి టూరిస్టుగా వచ్చిన యువతిని లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఇద్దరినీ అరెస్ట్ చేసి విచారించారు. తొలుత ఆరోపణలను ఖండించిన భారతీయులు, ఆపై వీడియో ఫుటేజ్ సాక్ష్యాలను చూపించడంతో నేరం అంగీకరించారు. ఇక వీరిపై కేసు విచారణ పూర్తయ్యేంత వరకూ పోలీసులకు సహకరించి, చైనాలో ఉండేందుకు సదరు యువతి సిద్ధంగా లేకపోవడంతో, వీరిని దేశం నుంచి బహిష్కరించాలని అధికారులు నిర్ణయించగా, వారిని ఇండియాకు డిపోర్ట్ చేశారు.