: ‘గోల్డ్‌మేన్’ను చంపింది అతని కుమారుడి స్నేహితులే!
బంగారు చొక్కాను ధరిస్తూ పుణెలో ‘గోల్డ్‌మేన్’గా పేరుతెచ్చుకున్న బిజినెస్ మేన్ దత్తాత్రేయ పుగే ఇటీవల హత్యకు గురయిన విషయం తెలిసిందే. ‘గోల్డ్‌మేన్’ హత్య ఉదంతంపై దర్యాప్తు చేపడుతోన్న పోలీసులకి దత్తా కుమారుడు శుభమ్ స్నేహితులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది. కేవలం 1.5 లక్షల రూపాయల కోసం వారు ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. ‘గోల్డ్‌మేన్’ కుమారుడు శుభమ్ స్నేహితుడు అతుల్ మోహిత్ గురువారం రాత్రి శుభమ్‌కి ఫోన్ చేసి తమ మిత్రుడి బర్త్ డే వేడుకకు రావాలని, తనతో పాటు తండ్రి ‘గోల్డ్‌మేన్’ని కూడా తీసుకురావాలని ఆహ్వానించాడు. పార్టీలో ఉత్సాహంగా గడుపుదామని వచ్చేటప్పుడు బిర్యానీ, సిగరెట్ ప్యాకెట్లు కూడా తీసుకురమ్మని శుభమ్‌కి అతుల్ మోహిత్ చెప్పాడు. స్నేహితుడు చెప్పినట్లుగానే శుభమ్ తన తండ్రి దత్తాను పార్టీకి వెళ్లాలని కోరాడు. తాను తన స్నేహితుడు రోహన్ పంచాల్‌తో కలిసి బిర్యానీ, సిగరెట్ ప్యాకెట్లు తీసుకురావడానికి మరో కారులో వెళ్లాడు. పార్టీకి వెళ్లిన గోల్డ్‌మేన్‌ని శుభమ్ స్నేహితుడు మోహిత్, మరికొందరు కత్తితో పొడిచారు. శుభమ్ అక్కడికి చేరుకునే సమయానికి మోహిత్, మరికొందరు తన తండ్రిని పొడుస్తూ కనపడ్డారు. ఈ విషయాన్ని శుభమ్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. గోల్డ్‌మేన్‌ని పొడిచిన తర్వాత మోహిత్, అతడి స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు.