: మరోసారి స్మృతీ ఇరానీకి షాక్!
రాహుల్ గాంధీపై పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ స్మృతీ ఇరానీకి బీజేపీ చాలా ప్రాధాన్యతనిచ్చింది. గాంధీల కుటుంబంపై పోరాటానికి ఆమెను సన్నద్ధం చేసే క్రమంలో కీలకమైన మానవ వనరుల శాఖను కట్టబెట్టి ఆమె ప్రాధాన్యతను చాటారు. అయితే, పార్లమెంటు సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ కు సమాధానమిస్తూ ఆమె చేసిన భావోద్వేగ నాటకీయ ప్రసంగం ఆకట్టుకోవడానికి బదులు విమర్శలు ఎదుర్కొనేలా చేసింది. ప్రతిపక్షాలను ఏకతాటిపై నిలబడేలా చేసింది. దీంతో ఊహించని ఇబ్బందులు ఎదురయ్యాయి. రాజ్యసభలో ఒక్క బిల్లు కూడా ఆమోదానికి నోచుకోలేదు. అనంతరం రోహిత్ వేముల, కన్నయ్య కుమార్ వ్యవహారాలు బీజేపీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టేశాయి. ఫలితంగా మానవ వనరుల శాఖ నుంచి జౌళి శాఖకు మార్చేశారు. తాజాగా ఆమెను పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ నుంచి తొలగించారు. ఈ నిర్ణయం ఆమెను నిరాశకు గురిచేసేదే.