: జాతీయ మీడియా తీరు ఏం బాగోలేదు!: కాశ్మీర్ ఐఏఎస్ టాపర్ ఆగ్రహం
జాతీయ మీడియా తీరుపై కాశ్మీర్ ఐఏఎస్ టాపర్ షా ఫైజల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్పీ రేటింగ్ కోసం మీడియా వాడీవేడి కథనాలు వండి వార్చుతోందని మండిపడ్డారు. ఈ కథనాలు కాశ్మీరీలను మరింత ఏకాకులను చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వారిలో మరింత ఆగ్రహాన్ని రేపుతున్నాయని వ్యాఖ్యానించిన ఆయన, భారత ప్రభుత్వ తీరు కంటే మీడియా తీరే దారుణంగా ఉందని చెప్పారు. తన ఫోటోల పక్కన బుర్హాన్ వనీ ఫోటోలు పెట్టి కథనాలు ప్రసారం చేయడంపై ఆయన మండిపడ్డారు. రాజ్యం తన పౌరుల్ని తానే చంపడం లేదా గాయపర్చడం అంటే తనను తాను గాయపర్చుకుని స్వీయ విధ్వంసం చేసుకోవడమేనని ఆయన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. ఈ విధానం మారకపోతే పాఠశాల విద్యా డైరెక్టర్ పోస్టుకు రాజీనామా చేస్తానని ఆయన తెలిపారు. ఇది కలకలం రేపుతోంది.