: ఉగ్రదాడుల్లో 707 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.. 3200 మంది గాయపడ్డారు: డాటా విడుదల చేసిన ప్రభుత్వం


గత దశాబ్దంన్నర కాలంగా భారత్ లో జరుగుతున్న ఉగ్రదాడుల్లో ఇప్పటి వరకు 707 మంది మరణించగా, 3,200 మంది గాయపడినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఆర్టీఐ కార్యకర్త గౌరవ్ అగర్వాల్ దరఖాస్తుకు స్పందించిన హోంమంత్రిత్వ శాఖ గురువారం రాత్రి ఇందుకు సంబంధించిన డాటాను విడుదల చేసింది. దాని ప్రకారం దేశంలో 2005 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉగ్రదాడుల్లో 707 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. 3,200 మంది క్షతగాత్రులయ్యారు. ఇండియా వాణిజ్య రాజధాని ముంబైలో జూలై 11, 2006న లోకల్ రైళ్లలో జరిగిన ఏడు బాంబు పేలుళ్లలో 187 మంది చనిపోగా 817 మంది గాయపడ్డారు. ఆ తర్వాత సరిగ్గా రెండేళ్లకు పాకిస్థాన్ నుంచి వచ్చిన ముష్కరులు నవంబరు 26 నుంచి 28 వరకు నగరంలో బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో 175 మంది మృతి చెందగా 291 మంది క్షతగాత్రులయ్యారు. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత దాని పరిణామాలను ముంబై ఎదుర్కోవలసి వచ్చింది. బాబ్రీ కూల్చివేతకు నిరసనగా ఉగ్రవాదులు ముంబైలో బాంబులతో విరుచుకుపడ్డారు. 13 ఆర్డీఎక్స్ బాంబులు వివిధ ప్రాంతాల్లో ఒకదాని తర్వాత ఒకటి పేలాయి. ఈ పేలుళ్లలో 257 మంది చనిపోయారు. 700 మంది గాయపడ్డారు. జూలై 2011లో జరిగిన బాంబు దాడిలో 27 మంది చనిపోగా 127 మంది క్షతగాత్రులయ్యారు. ఢిల్లీ కూడా పలు ఉగ్రదాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది. 1985లో బబ్బార్ ఖల్సా అనే ఉగ్రవాది ట్రాన్సిస్టర్ బాంబులు పేల్చాడు. ఈ ఘటనలో 80 మంది మృతి చెందారు. ఆ తర్వాత 2005 వరకు రాజధాని ప్రశాంతంగా ఉంది. అక్టోబరు 29, 2005లో మరోసారి ముష్కరులు బాంబు దాడులకు తెగబడ్డారు. పహర్ గంజ్, సరోజినీనగర్, గోవిందపురిలలో జరిగిన బాంబు పేలుళ్లలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. 105 మంది గాయపడ్డారు. అలాగే సెప్టెంబరు 2008లో జరిగిన దాడుల్లో 156 మంది, సెప్టెంబరు 7, 2011లో జరిగిన బాంబు పేలుళ్లలో 15 మంది మృతి చెందగా 79 మంది గాయపడినట్టు ప్రభుత్వం పేర్కొంది.

  • Loading...

More Telugu News