: నో డౌట్... జకీర్ శాంతి దూతే!... డిగ్గీరాజా వ్యాఖ్యలపై విమర్శల వెల్లువ!


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మరో వివాదానికి తెర తీశారు. ఇస్లామిక్ రీసెర్చి ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్) వ్యవస్థాపకుడు వివాదాస్పద మత గురువు జకీర్ నాయక్ ను వెనకేసుకొస్తూ ఆయన నిన్న చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్రలోని పందర్ పూర్ విఠలేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వెళుతున్న క్రమంలో పుణేలో నిన్న డిగ్గీరాజా చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే తెర తీసేలా ఉన్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రదాడిలో పాలుపంచుకున్న ముష్కరుడొకడు... తాను జకీర్ నాయక్ ప్రసంగాలతోనే ఉగ్రవాదం వైపు మళ్లానంటూ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జకీర్ చుట్టూ వివాదం రేగింది. ‘పీస్ టీవీ’ ద్వారా ఆయన చేస్తున్న ప్రసంగాలను పరిశీలిస్తున్న మహారాష్ట్ర పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ ప్రారంభించాయి. ఈ క్రమంలో అరెస్ట్ భయంలో దేశానికి తిరిగివచ్చే విషయాన్ని వాయిదా వేసుకున్న జకీర్... నిన్న సౌదీ అరేబియాలోని మదీన నుంచి స్కైప్ ద్వారా మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత పుణేలో మీడియా ముందుకు వచ్చిన డిగ్గీరాజా... జకీర్ ను శాంతి దూతగా అభివర్ణించారు. జకీర్ ముమ్మాటికీ శాంతి దూతనే అని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇస్లామ్ కు, ఉగ్రవాదానికి లింకు పెడుతోందని ఆరోపించారు. జకీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తున్న మోదీ సర్కారు... అదే తరహాలో వ్యాఖ్యలు చేస్తున్న సొంత పార్టీ నేతలు సాధ్వీ ప్రాచీ, యోగి ఆదిత్యనాథ్, సాక్షి మహారాజ్ లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కూడా ప్రశ్నించారు. 2012లో జకీర్ ప్రసంగించిన వేదికపై తాను ఉన్న మాట వాస్తవమేనని చెప్పిన డిగ్గీరాజా... నాడు జకీర్ ఒక్క అనుచిత వ్యాఖ్య కూడా చేయలేదని కూడా పేర్కొన్నారు. డిగ్గీరాజా వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News