: పేదరిక నిర్మూలనకు కేంద్రం మరో ముందడుగు... ప్రతి గ్రామంలో ఐదు నిరుపేద కుటుంబాలపై ప్రత్యక్ష పర్యవేక్షణ


పేదరిక నిర్మూలనపై కేంద్రం మరో ముందడుగు వేసింది. ఈ విషయంలో ఇప్పటి వరకు చేపడుతున్న చర్యలు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతుండడంతో సరికొత్త నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రతీ గ్రామం నుంచి ఐదు నిరుపేద కుటుంబాలను ఎంచుకుని, ఆ కుటుంబాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని నిర్ణయించింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. ఇందులో భాగంగా ప్రతీ గ్రామంలోనూ ఐదు పేద కుటుంబాలను ఎంచుకుని వాటిని నిరంతరం పర్యవేక్షిస్తారు. ప్రభుత్వం చేపడుతున్న పేదరిక నిర్మూలన పథకాలు వీరిపై ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయన్న విషయాన్ని పరిశీలిస్తారు. పేదరిక నిర్మూలన కోసం ప్రస్తుతం 21 పథకాలు అందుబాటులో ఉన్నాయి. ‘‘పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. అయితే ఇప్పటి వరకు ఈ విషయంలో దేశంలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. పథకాలు ఎలాగున్నాయంటే పేరుకు ఎక్కువ, మనుషులకు తక్కువ అన్నట్టు ఉన్నాయి’’ అని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. బీపీఎల్ సర్వే ద్వారా ఐదు కుటుంబాలను ఎన్నుకుని పర్యవేక్షించడం ద్వారా తప్పు ఎక్కడ జరుగుతుందనే విషయాన్ని అర్థం చేసుకునే వీలుందని ఆయన తెలిపారు. అలాగే పర్యవేక్షిస్తున్న కుటుంబాల వివరాలను క్రమం తప్పకుండా తెలుసుకునేందుకు ఓ సాఫ్ట్ వేర్ ను కూడా రూపొందించాలని కేంద్రం యోచిస్తోంది.

  • Loading...

More Telugu News