: పిల్లలు ఆలస్యంగా నిద్రపోతున్నారా?... ఆ అలవాటు మార్చుకోవాల్సిందే!
మీ పిల్లలు రాత్రి పూట ఆలస్యంగా పడుకొని, ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తున్నారా? అయితే వారి తీరు మార్చేయాల్సిందేనంటున్నారు ఓహియో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. మామూలుగా సూర్యుడు ఉదయించకముందే నిద్రలేవాలంటే అందరికీ బద్ధకమే. కానీ ఈ అలవాటు పిల్లల్లో అలాగే కొనసాగితే వారు భవిష్యత్తులో ఊబకాయంతో పాటు ఇతర రోగాల పాలవుతారని వైద్యులు చెబుతున్నారు. తాము 977 మంది పిల్లలపై చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయిందని వారు పేర్కొన్నారు. పిల్లలు రాత్రి త్వరగా నిద్రపోయి, ఉదయాన్నే మేల్కొనేలా జాగ్రత్తపడితేనే వారిని ఊబకాయం లాంటి సమస్యలనుంచి తప్పించగలమని వైద్యులు తెలిపారు. పిల్లలు రాత్రి 8 గంటల లోపే పడుకోవాలని వారు సూచించారు. రాత్రి 9 గంటల తరువాత పిల్లలు నిద్రపోతే అనారోగ్య సమస్యల బారిన పడతారని వారు హెచ్చరించారు. ఉదయం ఆలస్యం చేయకుండా లేచే పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు, సానుకూల దృక్పథంతో మెలుగుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడయిందని పేర్కొన్నారు.