: 10 శాతం నష్టపోనున్న రిలయన్స్... గుబులు పుట్టిస్తున్న ముందస్తు అంచనాలు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత కార్పొరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభాలు 10 శాతం వరకూ పతనం కానున్నాయి. ఇటీవల రీసెర్చ్ సంస్థలు మార్కెట్ నిపుణులతో సర్వే నిర్వహించగా, ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో చెప్పిన మాటిది. ఏప్రిల్ వరకూ తగ్గుతూ వచ్చిన క్రూడాయిల్ ధరలు, ఆపై గణనీయంగా పెరగడమే ఇందుకు కారణం. 2015-16 ఆర్థిక సంవత్సరం క్యూ-4లో సంస్థ నెట్ ప్రాఫిట్ రూ. 7,320 కోట్లు కాగా, అది ఏప్రిల్ - జూన్ త్రైమాసికానికి రూ. 6,549 కోట్లకు తగ్గనుందని ఏంజల్ బ్రోకింగ్ అంచనా వేసింది. అమ్మకపు ఆదాయం 12.7 శాతం తగ్గి రూ. 65,817 కోట్ల నుంచి రూ. 57,426 కోట్లకు చేరవచ్చని కూడా అంచనాలు వేసింది. గత సంవత్సరం క్యూ-1తో పోలిస్తే 3.7 శాతం వరకూ నికర లాభాన్ని సంస్థ పొందవచ్చని తెలుస్తున్నా, జనవరి - మార్చి మధ్య కాలంతో పోలిస్తే మాత్రం ఇది తక్కువే. ఈ నేపథ్యంలో రిలయన్స్ పై పెట్టుబడులు పెట్టే చిన్న ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. రిలయన్స్ ఆదాయం, లాభాలపై అంచనాలు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి సంస్థ ఈక్విటీ ఒడిదుడుకులకు లోనవుతుందని గుర్తు చేస్తున్నారు. సంస్థపై బెట్టంగ్ చేసే ముందు వేచిచూసే ధోరణిలో ఉంటేనే మేలని సలహా ఇస్తున్నారు. రిలయన్స్ పై వస్తున్న వార్తలు మార్కెట్ వర్గాలకు గుబులు పుట్టిస్తున్నాయి.