: బిచ్చగాళ్ల ఏరివేత విషయంలో... తన ప్రభుత్వ శాఖను తానే విమర్శించిన కేజ్రీవాల్!


తన ప్రభుత్వాన్ని తానే విమర్శించుకున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. సాంఘిక సంక్షేమ శాఖపై పెను విమర్శలు చేశారు. ఢిల్లీలో బిచ్చగాళ్లను తరిమికొట్టాలని ఆ శాఖ చేపట్టిన కార్యక్రమం మానవత్వం లేనిదని అభివర్ణించారు. సాంఘిక సంక్షేమ శాఖ చేస్తున్న పని ఎంతమాత్రమూ ఆమోదనీయం కాదని, మానవత్వం లేని ఈ చర్యలను తక్షణం నిలిపివేయాలని తాను ఆదేశిస్తున్నానని అన్నారు. ఈ ఉదయం పత్రికల్లో వచ్చిన వార్త క్లిప్పింగ్ తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. ఢిల్లీ సోషల్ వెల్ఫేర్ విభాగం బిచ్చగాళ్లను తరిమికొట్టేందుకు 10 రోజుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుందని, వీధుల్లో భిక్షాటన చేసే వారిని అదుపులోకి తీసుకుని వారిని ఆర్సీఆర్ (రిసెప్షన్ - కమ్ - రీక్లిసిఫికేషన్) సెంటరుకు చేర్చాలని కేజ్రీవాల్ సర్కారు ఆదేశాలు జారీ చేసిందన్నది సదరు కథనం. ఇందులో భాగంగా 10 టీములను ఇప్పటికే ఏర్పాటు చేశారని, ఆడవారు, మగవారు ఎవరైనా బిచ్చమెత్తుతూ కనిపిస్తే, వారిని వాయవ్య ఢిల్లీ ప్రాంతంలోని లాంపూర్ కు తరలిస్తారని పత్రిక పేర్కొంది. బిచ్చగాళ్ల మూలాలను ఏరివేయకుండా, ఈ తరహా చర్యలు ఫలాలనివ్వవని అభిప్రాయపడింది. ఈ కథనాన్ని చూసిన కేజ్రీవాల్ సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ పై మండిపడ్డారు. కాగా, ఢిల్లీలో ప్రస్తుతం 2 వేల మంది యాచక వృత్తిలో ఉండగా, ఓ పెద్ద మాఫియా సామ్రాజ్యం దీన్ని పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. వారిని అదుపు చేస్తేనే యాచగాళ్లను నియంత్రించ వచ్చన్నది అత్యధికుల అభిప్రాయం.

  • Loading...

More Telugu News