: కేంద్రం సూచనలకు విరుద్ధంగా తెలంగాణ అడుగులు!


రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర విద్యుత్ కొరతతో అల్లాడిన కొత్త రాష్ట్రం తెలంగాణ... విద్యుదుత్పత్తిలో స్వయంసమృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఇది శుభపరిణామమే అయినా... ఈ విషయంలో కేసీఆర్ సర్కారు కేంద్రం సూచనలను ఖాతరు చేసే దిశగా ముందుకెళ్లడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యుత్ కొరతకు శాశ్వత నివారణ దిశగా చర్యలు ప్రారంభించిన కేసీఆర్ ప్రభుత్వం... కొత్తగా ధర్మల్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఖమ్మం జిల్లా మణుగూరులో 1,080 వేల మెగావాట్ల సామర్థ్యంతో ఓ ప్రాజెక్టు, నల్లగొండ జిల్లా దామరచర్లలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో మరో ప్రాజెక్టుకు తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ రెండు ప్రాజెక్టుల్లో బొగ్గు వినియోగం ద్వారానే తెలంగాణ విద్యుదుత్పత్తి చేయనుంది. అయితే ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన బొగ్గు లభ్యత సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు. దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు ద్వారా ఈ ప్రాజెక్టుల్లో విద్యుదుత్పాదనకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుల కారణంగా భారీ ఎత్తున కాలుష్యం తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణాన్ని విరమించుకోవాలని కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవలే తెలంగాణకు సూచించారు. ఈ రెండు ప్రాజెక్టులను రద్దు చేసుకోవడం ద్వారా ఏర్పడే విద్యుత్ కొరతను తాము తీరుస్తామని, అది కూడా సాధారణ ధర కంటే కూడా తక్కువకే అందిస్తామని కూడా ఆయన సూచించారు. అయితే గోయల్ ప్రతిపాదనను పెడచెవిన పెట్టిన తెలంగాణ సర్కారు తాననుకున్న మార్గంలో ముందుకెళ్లేందుకే సిద్ధమైంది. ఈ వ్యవహారంపై జాతీయ మీడియాలో ఆసక్తికర కథనాలు వెలువడ్డాయి.

  • Loading...

More Telugu News