: నేడు ఔటర్ రింగ్ రోడ్డులో మిగిలిన మార్గాన్ని ప్రారంభించనున్న కేటీఆర్
హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లో మిగిలిపోయిన మార్గాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు. మొత్తం రూ.6696 కోట్లతో చేపట్టిన 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ నిర్మాణాన్ని మూడు దశల్లో చేపట్టారు. 137 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి రాగా, 21.30 కిలోమీటర్ల మార్గం పనులకు కాంట్రాక్టు పొందిన సంస్థలు సకాలంలో పూర్తి చేయలేదు. దీంతో, ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి, రెండు వేర్వేరు నిర్మాణ సంస్థలకు కాంట్రాక్టు ఇచ్చారు. ఘట్ కేసర్ నుంచి కీసర మీదుగా శామీర్ పేట వరకు పనులను గాయత్రి ప్రాజెక్టు లిమిటెడ్ కు, కీసర నుంచి ఘట్ కేసర్ వరకు పనులను నాగార్జున కన్ స్ట్రక్షన్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. అయితే, ఘట్ కేసర్ ఇంటర్ చేంజ్ వద్ద పనులపై స్టే ఆర్డర్ ఉండటంతో పనులు ఆలస్యమయ్యాయి. ఈ ఏడాది జనవరిలో దానిపై స్టే ఎత్తి వేయడంతో పనులు శరవేగంగా నిర్వహించడంతో జూన్ వరకు ఓఆర్ఆర్ మెయిన్ క్యారేజ్ ను పూర్తి చేశారు. మరో మూడు నెలల్లో ఈ రోడ్లు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని ఓఆర్ఆర్ ప్రాజెక్టు అధికారులు తెలిపారు.