: కశ్మీర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. బుర్హాన్ వనీ దాక్కున్న ఇల్లు దహనం


కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్‌కౌంటర్ సమయంలో హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ దాక్కున్న ఇంటిని ఆందోళనకారులు తగలబెట్టారు. ఆయన దాక్కున్న ఇంటి యజమానే ఆ విషయాన్ని లీక్ చేశాడని భావించిన ఆందోళనకారులు ఇంటికి నిప్పు పెట్టారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలతో వనీ తనను తాను హీరోగా భావించుకునేవాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఆయనను సజీవంగా పట్టుకునే అవకాశం ఉన్నా వనీ అని నిర్ధారించుకున్న తర్వాత కాల్చి చంపేశారని ఆరోపిస్తున్నారు. వనీ ఎన్‌కౌంటర్ అనంతరం కశ్మీర్ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. ఆయన అంత్యక్రియల సందర్భంగా ఆందోళనకారులు రెచ్చిపోయారు. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. వేర్పాటువాదులు వరుసగా ఆరో రోజు కూడా బంద్ కొనసాగిస్తున్నారు. వరుస అల్లర్లలో 37 మంది చనిపోగా 1400 మందికిపైగా గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా కశ్మీర్ వ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ముందస్తు చర్యగా తమ సేవలను నిలిపివేయాల్సిందిగా ప్రైవేటు టెలికంతోపాటు బీఎస్ఎన్ఎల్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

  • Loading...

More Telugu News