: నాడు ఒబామా 'గార్డ్ ఆఫ్ ఆనర్'కు నేతృత్వం వహించిన పూజ... నేడు తనకు అన్యాయం జరిగిందంటూ ట్రైబ్యునల్ కు!


పూజా ఠాకూర్... భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్. గత సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చిన వేళ, ఆయనకు గౌరవ వందనం సమర్పించిన బృందానికి నేతృత్వం వహించి వార్తల్లో నిలిచిన మహిళ. ఇండియాలో గార్డ్ ఆఫ్ ఆనర్ ను లీడ్ చేసిన తొలి మహిళ కూడా. ఇప్పుడు తనను పర్మినెంట్ కమిషన్ లో చేర్చుకోకుండా భారత వాయుసేన తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ, ఆర్ముడ్ ఫోర్సెస్ ట్రైబ్యునల్ లో పిటిషన్ వేశారు. మహిళనైన తనపై వివక్ష చూపుతున్నారని, పక్షపాత ధోరణితో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపించేందుకు అంగీకరించిన ట్రైబ్యునల్, నెల రోజుల్లోగా స్పందించాలని వాయుసేనకు నోటీసులు పంపింది. ఇదిలావుండగా, పూజా ఠాకూర్ చేసిన ఆరోపణలను మాజీ వింగ్ కమాండర్ ప్రఫుల్ బక్షీ ఖండించారు. వాయుసేనలో స్త్రీ, పురుష భేదం లేదని తెలిపారు. కేవలం సెలక్షన్ ప్యానలే పర్మినెంట్ కమిషన్ అధికారులను ఎంపిక చేస్తుందని, గార్డ్ ఆఫ్ ఆనర్ కు నేతృత్వం వహించడం ఎలాంటి అర్హతా కాదని అన్నారు. ఎన్నో కొలమానాల ఆధారంగా కమిషన్ లో చోటు లభిస్తుందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News