: మేకలను బలివ్వడానికి డబ్బు కోసం సొంత బిడ్డను అమ్మేసిన మహిళ!
ఆ గిరిజన మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే శిశువుకి జన్మనిచ్చిన కొన్ని రోజులకే ఆ బిడ్డను అమ్మేసింది. బిడ్డను అమ్మిన కారణాన్ని గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. జార్ఖండ్‌లోని బ్రిహోర్‌లో ఈ సంఘటన జరిగింది. గిరిజన తెగకు చెందిన ఆనోదేవి అనే మహిళ తమ తెగ ఆచారాన్ని పాటించడం కోసం తన బిడ్డను అమ్మేసింది. ఆ ఆచారం ఏంటంటే.. ఎవరైనా బిడ్డకు జన్మనిస్తే అడవి దేవతలను సంతోషపెట్టాలి. దాని కోసం రెండు మేకలను దేవతలకు బలివ్వాలి. కానీ ఆ మహిళ వద్ద మేకలను కొనేందుకు డబ్బులేదు. మరోవైపు ఆ మహిళ కొన్ని నెలల క్రితమే భర్తను కోల్పోయి తినడానికే తిండి దొరకని పరిస్థితికి వచ్చింది. దీంతో ఆ మహిళ తన బిడ్డను రెండు వేల రూపాయలకు ఓ వ్యాపారవేత్తకు అమ్మేసింది. ఈ వార్త అక్కడి అధికారులకు చేరింది. దీంతో స్పందించిన అధికారులు వ్యాపారవేత్త వద్ద నుంచి బిడ్డను తెచ్చి మళ్లీ ఆ తల్లికి ఇచ్చేశారు. అయితే తన వద్ద బిడ్డను పెంచడానికి డబ్బు లేదని, బిడ్డ వ్యాపారవేత్త వద్దయినా బాగా పెరుగుతుందని ఆశించి తాను ఈ పనిచేశానని ఆనోదేవి చెప్పింది. కానీ తమ ఆచారం కోసం మేకలను కొనడానికే మహిళ బిడ్డను అమ్మేసినట్లు విచారణలో అధికారులకు తెలిసింది. మేకలను బలిచ్చి విందు ఇవ్వడం కోసమే తాను తన బిడ్డను అమ్మేసినట్లు చివరకు ఆమె అంగీకరించింది. అయితే తనకు ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారని, వారిని పెంచడానికే డబ్బు సరిపోవడం లేదని ఆమె వాపోయింది. తనకు వ్యాపారవేత్త ఇచ్చిన 20 వేల రూపాయలు తిరిగి అతనికి ఎలా చెల్లించాలని ఆమె ప్రశ్నిస్తోంది. తన బిడ్డను వ్యాపారవేత్తకు దత్తతకైనా ఇస్తానని వాదించింది.