: చిన్న బ్యాగుల్లో బట్టలు కుక్కి విమానాలు ఎక్కుతున్నారా?... అదనపు క్యాబిన్ బ్యాగ్ కు రూ. 900 చార్జ్!


విమానాల్లో ప్రయాణిస్తూ, చెకిన్ బ్యాగేజీ చార్జీని తప్పించుకోవడానికి రెండు లేదా మూడు చిన్న సూట్ కేసులు లేదా బ్యాగుల్లో బట్టలు, సామాన్లు కుక్కి వాటిని తీసుకువెళ్లేవారిని ఎందరినో చూస్తుంటాం. ఇకపై అలా సాగనీయబోమని ఎయిర్ లైన్స్ కంపెనీలు అంటున్నాయి. దేశవాళీ విమాన సేవల్లో ఒక్క ఉచిత క్యాబిన్ బ్యాగుకు మాత్రమే అనుమతి ఉంటుందని, మరో బ్యాగు తెస్తే, రూ. 900 కట్టాల్సిందేనని జెట్ ఎయిర్ వేస్ తేల్చి చెప్పింది. పురుషులైతే ఒక లగేజీ బ్యాగు, మరో ల్యాప్ టాప్ బ్యాగును అనుమతిస్తామని, స్త్రీలైతే అదనంగా హ్యాండ్ బ్యాగ్ తీసుకురావచ్చని తెలిపింది. ఆ బ్యాగు బరువు కూడా ఏడు కేజీల లోపున లేదా 10 కేజీల వరకూ మాత్రమే ఉండాలని, ఎకానమీ, బిజినెస్, జెట్ ప్రివిలేజ్ ప్లాటినమ్, గోల్డ్ వంటి ప్రయాణించే తరగతి, సౌకర్యాలపై ఆధారపడి బ్యాగేజ్ బరువు నిర్ణయిస్తామని తెలిపింది. ఇక ఇదే నిర్ణయాన్ని ఇతర విమానయాన కంపెనీలు సైతం పాటిస్తాయని ఈ రంగంలోని నిపుణులు భావిస్తున్నారు. అయితే, తామేమీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోలేదని, కొంతమంది అధిక సంఖ్యలో బ్యాగులు తెస్తున్నందున విమానాల్లో సీట్లపైన ఉండే లగేజీ ర్యాక్స్ లో వాటిని సర్దలేక పోతున్నామని, తత్ఫలితంగా బోర్డింగ్ ఆలస్యమవుతూ, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగి, సంస్థ పనితీరుపై ప్రభావం పడుతోందని జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. విమానాశ్రయంలోకి ప్రవేశించిన తరువాత కొనుగోలు చేసే డ్యూటీ-ఫ్రీ బ్యాగ్స్ విషయంలో మాత్రం నిబంధనలేమీ లేవని వివరించారు.

  • Loading...

More Telugu News