: పుష్కరాల పేరుతో ఏపీ ప్రభుత్వం భారీ దోపిడి చేస్తోంది: వైసీపీ నేత పార్థసారధి
పుష్కరాల పనులు దోపిడికి ఆయుధంగా మారాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుష్కరాల పేరుతో వేలకోట్ల అవినీతి జరుగుతోందని, ప్రభుత్వం అడ్డగోలుగా దోచేస్తుందని అన్నారు. అవినీతిని ముఖ్యమంత్రి కార్యాలయమే ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే పుష్కర పనుల్లో జాప్యం చేసి, నామినేషన్ కాంట్రాక్ట్‌లు ఇవ్వడం దోపిడి కాదా..? అని ఆయన ప్రశ్నించారు. పుష్కర నిధులపై విజిలెన్స్ లేదా సీబీసీఐడీతో విచారణ జరిపించాలని పార్థసారధి డిమాండ్ చేశారు. గోదావరి పుష్కర దుర్ఘటనను ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఆయన అన్నారు. ఆ పుష్కరాల్లో చంద్రబాబు ప్రచార ఆర్భాటానికి 30 మంది బలయ్యారని ఆయన పేర్కొన్నారు. తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన కమిషన్ ఇప్పటి వరకు చంద్రబాబును విచారించలేదని ఆయన అన్నారు. దీన్ని బట్టే కమిషన్ నివేదిక ఏ విధంగా ఉంటుందో చెప్పొచ్చని ఆయన ఉద్ఘాటించారు.