: కేసీఆర్ దేశంలోనే నం.1 సీఎంగా నిలవడం సంతోషకరం: తుమ్మల
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాశానికెత్తేశారు. ఈరోజు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తోన్న ఆయన అక్కడి తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పలు గ్రామాల రోడ్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేసి మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో ఓ ఉద్యమంలా మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతోందన్నారు. తెలంగాణలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని ఆయన కొనియాడారు. నాటి కాకతీయుల పాలనే ఆదర్శంగా కేసీఆర్ తెలంగాణలో మిషన్ కాకతీయ చేపట్టి ఈ పథకాన్ని ముందుకు నడిపిస్తున్నారని తుమ్మల అన్నారు. అపర భగీరథుడిలా, నీళ్లందించడమే లక్ష్యంగా కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టారని ఆయన పేర్కొన్నారు. అశోకుడిలా హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన కొనియాడారు. కేసీఆర్ మంచి పాలననందిస్తూ దేశంలోనే నంబర్‌వన్ సీఎంగా నిలవడం సంతోషకరమని, పరిపాలనాదక్షతకు ఆయన కలికితురాయిగా నిలిచారని తుమ్మల వ్యాఖ్యానించారు.