: ఢిల్లీలో మరో రబ్రీదేవి!... కేజ్రీ సతీమణి వీఆర్ఎస్ పై నెటిజన్ల సెటైర్లు!


ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ నిన్న తన సర్కారీ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) తీసుకున్నారు. సునీత దాఖలు చేసుకున్న అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఆమె వీఆర్ఎస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో సునీత నిన్నటి నుంచి ప్రభుత్వ ఉద్యోగానికి దూరమైపోయారు. సివిల్ సర్వీసెస్ లలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తర్వాత అత్యున్నత సర్వీసుగా పరిగణిస్తున్న ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) కు చెందిన సునీత... ఇన్ కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రైబ్యూనల్ (ఐటీఏటీ)లో ఐటీ కమిషనర్ గా నిన్నటిదాకా పనిచేశారు. కేజ్రీవాల్ కూడా తొలుత ఐఆర్ఎస్ సర్వీసుకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చేశారు. తాజాగా ఆయన సతీమణి సునీత కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేయడంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది. పలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో సునీత వీఆర్ఎస్ ను ప్రస్తావిస్తూ నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి కేసుల్లో ఇరుక్కోగా... తనకు దక్కిన సీఎం పీఠంపై ఆయన తన సతీమణి రబ్రీదేవిని కూర్చోబెట్టారు. ఈ ఉదంతాన్ని గుర్తు చేసిన పలువురు నెటిజన్లు సునీతను కూడా ఢిల్లీ ‘రబ్రీదేవి’గా అభివర్ణించారు. కొందరైతే... సునీతను చదువుకున్న ‘రబ్రీదేవి’గా అభివర్ణించారు. ఢిల్లీ సీఎం పదవిని సునీతకు వదిలేయనున్న కేజ్రీ... పంజాబ్, గోవా రాష్ట్రాల సీఎంగా బరిలోకి నిలవనున్నారని కొందరు వ్యాఖ్యానించగా... సునీతనే ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సీఎం కేండిడేట్ గా బరిలోకి దిగుతారని చెప్పారు. ఇక కొందరేమో రాజ్యసభకు పంపేందుకే సునీతతో ఉద్యోగానికి కేజ్రీ రాజీనామా చేయించారని కామెంట్ చేశారు. ఇక వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని ప్రకటించిన ఆప్ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి పదవులు ఎలా దక్కుతాయంటూ ప్రశ్నలు సంధించారు.

  • Loading...

More Telugu News