: జకీర్ కు గేట్లు మూసేసిన ముంబై హోటళ్లు!... మరోమారు వాయిదా పడ్డ మత గురువు ప్రెస్ మీట్!
ఇస్లామిక్ మత బోధనల పేరిట ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మత గురువు జకీర్ నాయక్ ను సమస్యలు చుట్టుముట్టాయి. ముంబై పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు నేపథ్యంలో అరెస్ట్ భయం పట్టుకున్న జకీర్... సౌదీ అరేబియా నుంచి భారత్ వచ్చే విషయంలో వెనకడుగు వేశారు. అయితే ముందస్తుగా ప్రకటించిన మేరకు మీడియాతో అక్కడి నుంచే ‘స్కైప్’ ద్వారా మాట్లాడతానని ప్రకటించిన ఆయన అప్పటికే ఖరారు చేసిన మీడియా సమావేశాన్ని ఓ మారు వాయిదా వేశారు. నేడు ఆయన స్కైప్ మీడియా భేటీ జరగాల్సి ఉంది. అయితే నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత జకీర్ స్థాపించిన ఇస్లామిక్ రీసెర్చి ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్) నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత నేటి మీడియా సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు గల కారణాలను కూడా ఏకరువు పెట్టిన ఆ సంస్థ... స్కైప్ ద్వారా సౌదీ అరేబియా నుంచే జకీర్ మాట్లాడుతున్నప్పటికీ... ముంబైలో మీడియా ప్రతినిధులను సమావేశపరిచేందుకు వేదిక దొరకడం లేదని వాపోయింది. తమ ప్రెస్ మీట్ కోసం ముంబైలోని ఏ ఒక్క హోటల్ కూడా ఒప్పుకోవడం లేదని, కాన్ఫరెన్స్ హాళ్లను అద్దెకిచ్చేందుకు ససేమిరా అంటున్నాయని ఆ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే జకీర్ మీడియా సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని చెప్పిన ఆ ప్రతినిధి... త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు.