: 50 ఏళ్లు నిండితేనే బాలికల పాఠశాలలకు పురుష ఉపాధ్యాయులు... హర్యానా ప్రభుత్వం కొత్త రూల్!
బాలికల పాఠశాలల్లోని పురుష ఉపాధ్యాయులు, బాలికల పట్ల అనైతిక చర్యలకు దిగుతున్నారని హర్యానా సర్కారు గట్టిగా నమ్మినట్టుంది. అందుకే గర్ల్స్ స్కూళ్లలో తీసుకునే పురుష ఉపాధ్యాయుల వయసు కచ్చితంగా 50 సంవత్సరాలు నిండాల్సిందేనని కొత్త నిబంధన విధించింది. 2016-17 నుంచి ఈ నిర్ణయం అమలవుతుందని చెబుతూ, బదిలీల నిబంధనలను మార్చింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రామ్ బిలాస్ మాట్లాడుతూ, గత సంవత్సరం జూన్ 30 నాటికి 50 ఏళ్ల నిండని ఉపాధ్యాయులను బాలికల మాధ్యమిక పాఠశాలలకు బదిలీపై పంపే ప్రశ్నేలేదని తెలిపారు. ఒకవేళ బదిలీ ఆప్షన్ గా బాలికల పాఠశాలను ఎంచుకున్నా పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. ఎక్కడా అమలులో లేని నిబంధనలను పెట్టిన హర్యానా ప్రభుత్వ వైఖరితో ఉపాధ్యాయులు అవాక్కవ్వాల్సిన పరిస్థితి.