: మందు కొట్టేందుకు తప్పుడు గుర్తింపుకార్డు... దొరికిపోయిన యువకుడు!
చిన్నారి రమ్య సంఘటనతో హైదరాబాద్ లో 21 ఏళ్ల లోపు యువకులను బార్లు, పబ్ లలోకి అనుమతించవద్దని తెలంగాణలో ఎక్సైజ్ పోలీసులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో, మందుకొట్టడానికి బార్ లోకి ఎలా వెళ్లాలా? అనే ఉపాయం ఆలోచించిన 19 ఏళ్ల యువకుడు విశేష్ అగర్వాల్ కొత్త ప్లాన్ వేశాడు. జూబ్లీహిల్స్ రోడ్ నంబంర్ 10లోని ఎమ్మెల్యే, ఎంపీల కాలనీలో అతను నివసిస్తుంటాడు. ఢిల్లీలోని ఒక కళాశాలలో బీఏ చదువుతున్న అతను వారం రోజుల క్రితం హైదరాబాద్ వచ్చాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి జూబ్లీహిల్స్ లోని గ్లోకల్ బార్ అండ్ రెస్టారెంట్ కు వెళ్లాడు. నిబంధనల ప్రకారం అక్కడి సిబ్బంది గుర్తింపు కార్డు అడగటం, విశేష్ తన వద్ద ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ చూపించడం.. అందులో అతని డేటాఫ్ బర్త్ 1994 గా ఉండటంతో అతన్ని బార్ లోపలికి అనుమతించారు. అయితే, రాత్రి పదిగంటల సమయంలో తనిఖీల నిమిత్తం ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలసి ఆ బార్ లోకి వెళ్లారు. ఈ క్రమంలో విశేష్ అగర్వాల్ ను వారు ప్రశ్నించడంతో, అతను తన వద్ద ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ని చూపించాడు. అయితే, అతని డేటాఫ్ బర్త్ 1997గా ఉంది. దీంతో, అతన్ని ఎలా అనుమతించారని బార్ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించగా... తమకు చూపించిన లైసెన్స్ లో వేరుగా ఉందని వారు సమాధానమిచ్చారు. దీంతో, అతన్ని తనిఖీ చేయగా విశేష్ వద్ద అసలు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు తన డేటాఫ్ బర్త్ 1994గా ఉన్న నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది. ఈ విషయమై అతన్ని ప్రశ్నించగా తన పుట్టినతేదీని మార్ఫింగ్ చేసి నకిలీ ఐడీ కార్డును తయారు చేయించానంటూ తన తప్పును ఒప్పుకున్నాడు. దీంతో, అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.