: బీహార్లో న్యాయస్థానం ఆవరణలో బాంబు పేలుడు... యువకుడి మృతి
బీహార్ లోని న్యాయస్థానం ఆవరణలో బాంబు పేలుడు సంభవించడంతో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... రోహ్తాస్ జిల్లాలోని ససారం న్యాయస్థానంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ బాంబు పేలుడు ఘటనలో సచిన్ కుమార్ (22) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కోర్టుకు హాజరైన సచిన్ కుమార్ పార్క్ చేసిన బైకుకు దుండగులు బాంబును అమర్చినట్టు పోలీసులు తెలిపారు. దీంతో న్యాయస్థానంలో పని ముగించుకుని వచ్చిన సచిన్ తన బైక్ స్టార్ట్ చేయగానే బాంబు పేలిపోయిందని, దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణం విడిచాడని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలో డిటోనేటర్ ను స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ సుశాంత్ సరోజ్ తెలిపారు. ఈ పేలుడులో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని సమీపంలోని సదర్ ఆస్పత్రికి తరలించినట్టు ఆయన వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఆయన తెలిపారు.