: బురఖా వేసుకుని దర్జాగా పరారైన ఖైదీ!
శత కోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలని పెద్దలు ఊరికే అనలేదు. ఇండోనేషియా రాజధాని జకార్తలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి తెగబడ్డ కేసులో అన్వర్ బిన్ కిమ్ అనే వ్యక్తికి జకార్తా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో అతనిని సాలెంబా జైలుకు తరలించారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఖైదీలు బంధువులతో గడిపేందుకు అనుమతినిచ్చారు. అప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్న అన్వర్ బిన్ కిమ్ తన భార్యకు బురఖా తీసుకుని రమ్మని సూచించాడు. భార్య, పిల్లలు తనను కలిసేందుకు రాగా, ఏమీ తెలియని వ్యక్తిలా విజిటర్ రూంకి వచ్చాడు. అనంతరం తన ప్రణాళిక అమలు చేశాడు. భార్య తెచ్చిన బురఖా వేసుకుని, ఆమె లిప్ స్టిక్ దట్టంగా కొట్టుకుని, సన్ గ్లాసెస్ తగిలించుకుని విజిటర్ రూం నుంచి జైలు గార్డుల ముందు నుంచి దర్జాగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. సాయంత్రం అటెండెన్స్ సమయంలో అన్వర్ కనిపించకపోవడంతో సీసీ పుటేజ్ చూసిన పోలీసులు షాక్ కు గురయ్యారు. అయితే ఈ పుటేజ్ లీక్ కావడంతో మీడియా సంస్థలు దీనిని ప్రముఖంగా ప్రసారం చేశాయి. దీంతో అతని కోసం గాలింపు చేపట్టారు.