: ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించిన కేసీఆర్ కూ భంగపాటు తప్పదు: ఎమ్మెల్సీ పొంగులేటి


తెలంగాణలో ఇతర పార్టీలకు చెందిన 47 మంది ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్ లోకి చేర్చుకుని ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించిన కేసీఆర్ కి కూడా సుప్రీం కోర్టులో భంగపాటు తప్పదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ సంక్షోభంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టేందుకు ప్రయత్నిస్తోన్న ప్రధాని మోదీకి సుప్రీంకోర్టు తీర్పు చెంప పెట్టులాంటిదన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఫిరాయింపుల కేసు వ్యవహారాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ నెల 18న సుప్రీంలో ఇది విచారణకు రానుందన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని బలోపేతం చేసేందుకు పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తోందని, తెలంగాణలో పార్టీ ఫిరాయించిన వారిపై వేటు తప్పదని అన్నారు. ఫిరాయింపుల వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ సరిగ్గా వ్యవహరించలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ పార్టీ ఫిరాయింపు వెనుక ఉన్న వ్యవహారాన్ని ఆధారాలతో సహా తాను బయటపెడతానని పొంగులేటి అన్నారు.

  • Loading...

More Telugu News