: ఆరోగ్యశ్రీ చికిత్సలు చేయకుంటే గుర్తింపు రద్దే!... ప్రైవేటు ఆసుపత్రులకు టీ సర్కారు వార్నింగ్!
కొత్త రాష్ట్రం తెలంగాణలో ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సలకు సంబంధించి ప్రభుత్వం... ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రుల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. రూ.800 కోట్లకు పై చిలుకు పేరుకుపోయిన బిల్లులను విడుదల చేస్తే తప్పించి ఆరోగ్యశ్రీ చికిత్సలు చేయలేమని చెప్పిన ఆసుపత్రుల యాజమాన్యాలు సేవలను నిలిపేశాయి. అయితే విడతలవారీగా పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని చెప్పిన ప్రభుత్వం... పేదలకు వర ప్రదాయనిగా నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయవద్దని ఆసుపత్రులకు సూచించింది. అయితే కొన్ని ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలందిస్తున్నా, మరికొన్ని మాత్రం సేవలను నిలిపివేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం ఆసుపత్రులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసే ఆసుపత్రుల గుర్తింపును రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.