: దేశానికి రాకున్నా... మీడియాతో మాట్లాడనున్న జకీర్!... ‘స్కైప్’ను ఆశ్రయించిన మత గురువు!
ఇస్లామిక్ మత బోధనలతో యువతను ఉగ్రవాదం వైపు మళ్లేలా చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మత గురువు జకీర్ నాయక్ రోజుకో కొత్త ప్రకటన విడుదల చేస్తున్నారు. తనపై ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధమేనని ఇటీవల ప్రకటించిన జకీర్... మొన్న భారత్ కు వస్తున్నట్లు ప్రకటించారు. అయితే అరెస్ట్ భయంతో వెనకడుగు వేసిన ఆయన వచ్చే ఏడాది దాకా కూడా భారత్ కు తిరిగివచ్చే అవకాశాలు లేవంటూ తన న్యాయవాదితో నిన్న చెప్పించారు. తాజాగా ఆయన తనదైన శైలిలో ఓ వినూత్న ప్రకటన చేశారు. ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత రెండు, మూడు రోజులకు మీడియాతో మాట్లాడతానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారత్ కు ఇప్పుడప్పుడే రాలేనని చెప్పిన ఆయన మీడియాతో మాట్లాడే విషయాన్ని మాత్రం వాయిదా వేయలేదు. ప్రస్తుతం సౌదీ అరేబియాలోని మదీనాలో ఉన్న జకీర్... రేపు ‘స్కైప్’ ద్వారా భారత్ లోని మీడియా ప్రతినిధులతో మాట్లాడతారట. ఈ మీడియా సమావేశంలో ఆయన పక్కన తన న్యాయవాదులతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా కనిపిస్తారట.