: హైదరాబాద్‌లో కలరా కలకలం.. తొమ్మిదికి చేరిన బాధితుల సంఖ్య
రాజధాని హైదరాబాద్‌లో కలరా కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కలరా బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతుండగా తాజాగా ముగ్గురు స్టాఫ్ నర్సులు కలరా బారిన పడ్డారు. బొగ్గులకుంటలోని ఫెర్నాండెజ్ ఆస్పత్రికి చెందిన ముగ్గురు నర్సులకు కలరా సోకినట్టు మంగళవారం వైద్యులు నిర్ధారించారు. అలాగే అడ్డగుట్టలో మరో కేసును గుర్తించారు. దీంతో మొత్తం కలరా కేసుల సంఖ్య ఈనెలలో 9కి చేరుకుంది. కలరా బారిన పడిన నర్సుల్లో ఇద్దరు గత శుక్రవారం రోడ్డుపైన విక్రయించే క్రాన్‌బెర్రీ జ్యూస్‌ను తాగి తమ కొలీగ్‌కు కూడా తీసుకెళ్లారు. అది తాగిన ముగ్గురు.. తర్వాతి రోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విరేచనాలు, వాంతులతో బాధపడ్డారు. ఆస్పత్రిలో చేరిన వారికి కలరా సోకినట్టు వైద్యులు నిర్ధారించి చికిత్స అందిస్తున్నారు. నర్సులు ఉంటున్న హాస్టల్‌తోపాటు ఆస్పత్రిలోని నీళ్ల నమూనాలను సేకరించిన వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. నీరు కలుషితం కాకుండా చూసుకోవాలని, వీధుల్లోని ఆహారా పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.