: ఆయుధాలే లక్ష్యంగా దోపిడీ.. కశ్మీర్‌లో రెచ్చిపోతున్న ఆందోళనకారులు


హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత కశ్మీర్ తీవ్ర కల్లోలంగా మారింది. వీధుల్లోకి వచ్చిన ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. పోలీసులు, భద్రతా దళాలపైకి దాడులకు దిగుతున్నారు. హింసే లక్ష్యంగా విధ్వంసం సృష్టిస్తున్న ఆందోళనకారులు పోలీస్ స్టేషన్లలోకి చొరబడి ఆయుధాలను ఎత్తుకుపోతున్నారు. రెండు రోజుల క్రితం కుల్గాంలోని దమ్హల్ హంజిపొరా పోలీస్ స్టేషన్‌పై దాడిచేసి 70 సెమీ ఆటోమెటిక్ తుపాకులు, ఇతర ఆయుధాలను ఎత్తుకెళ్లిపోయారు. మంగళవారం కూడా ఇటువంటి ఘటనలే రెండు చోటుచేసుకున్నాయి. ఎత్తుకెళ్లిన ఆయుధాలతో వారు ప్రత్యేకంగా ఓ ఆయుధశాలను నిర్మించుకుంటున్నట్టు తెలుస్తోంది. నిన్న ఉదయం ట్రాల్‌లోని ఓ పోలీస్ పోస్టుపై దాడి చేసిన ఆందోళనకారులు కానిస్టేబుల్‌ను చితకబాది ఆయుధాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయన ప్రతిఘటించి రైఫిళ్లు వారికి అందకుండా చేశారు. దీంతో మ్యాగజైన్లు అందుకుని పరారయ్యారు. అలాగే సాయంత్రం కరల్‌పురా పోలీస్ స్టేషన్‌పైనా ఇటువంటి దాడే జరిగింది. పోలీస్ స్టేషన్ల నుంచి ఆందోళనకారులు పెద్ద ఎత్తున ఆయుధాలు దోచుకెళ్లడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో మరోసారి అల్లర్లు తలెత్తకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. పోలీసులు, భద్రతా దళాల నుంచి ఆయుధాలు ఎత్తుకెళ్లడం దశాబ్దం క్రితం ఇక్కడ సర్వసాధారణ విషయంగా ఉండేది. ఆ తర్వాత అటువంటి ఘటనలు జరగలేదు. తాజాగా బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత తిరిగి ఆందోళనకారులు ఆయుధాల చోరీకి పాల్పడుతున్నారు.

  • Loading...

More Telugu News