: హెల్మెట్ లేదా?... అయితే, పెట్రోల్ లేదు: పశ్చిమ బెంగాల్ లో కరాఖండీగా చెప్పేస్తున్న బంకులు
ద్విచక్రవాహనదారులకు ఎన్ని నిబంధనలు, ఆంక్షలు విధించినా హెల్మెట్ వాడకాన్ని మాత్రం అలవాటు చేయలేకపోతున్నారు. దీంతో వివిధ రాష్ట్రాల రవాణాశాఖలు కఠిన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నామని చెబుతున్నాయి. అయినప్పటికీ వాహనదారులు వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ రాష్ట్రంలో కూడా అమలుకు ఆదేశాలు జారీ చేశారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్ కు వెళ్తే వారికి పెట్రోల్ పోయవద్దని పెట్రోలు బంకు యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. వీటిని బంకులు పాటించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆదేశాలు సత్ఫలితాలు ఇవ్వడం ప్రారంభించాయి. హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుకు వచ్చిన వాహనదారులకు బంకుల సిబ్బంది పెట్రోల్ పోయడం లేదు. 'ప్లీజ్... ఈ ఒక్కసారి' అంటూ బతిమాలినప్పటికీ వారు జాలి చూపించడం లేదు. దీంతో హెల్మెట్ ధరించి పెట్రోలు బంకులు వస్తున్నారు.